This one - on his relationship with God!
దేవుడు
సెలవా జగదాంబ
నీకిపుడు
సెలవా బాలాంబా
చిడతలు
ఓ చివరిసారి గట్టిగా మోగి
ఆగిపోయాయి.
హారతిచ్చేశా,
భక్తి పీరియడ్ బెల్లు కొట్టేసి.
మెల్లగా కబుర్లు
కాసేపట్లో గుడి ఖాళీ అయ్యింది.
నేనూ, దేవుడూ మిగిలాం.
అప్పుడే
ఈ ఆలోచన వచ్చుంటే బావుండేది
అసలీ దేవుడెవరు?
దాసరెంకటేశ్వరరావు
ఇల్లు ఊరి చివర
ఇరుకు సందు
చివరి గుడిసె
ఎప్పుడూ చీకటి
‘వాళ్ళింట్లో దేవుడు లేడేమో!’
'యశోదమ్మా వెతన పడకూ
నందరాజా చింత పడకూ
కాళింది మడుగులోనా
కాలసర్పం పడగనెక్కి
తాండవమే ఆడెనా'
వాళ్ళ వెర్షన్
భాగవతం భలే పాడాడు.
చిందులేశాడు కూడా.
వాళ్ళ జీవితాల్లో కూడా
దేవుడున్నాడు!!!
మన దేవుడే.
అప్పటికీ ఈ ప్రశ రాలేదు బుర్రలోకి.
ఎవరీ దేవుడు?
విష్ణాలయం,
ధనుర్మాసం
పొద్దున్నే గుళ్లో వెన్న ముద్దలు,
బాదం ఆకులో
అందరి కంచాలూ అవే
ఊరంతా అక్కడే ఉండేది
నాది శివాలయం!
నా చూపు
పట్టించుకోకుండా
అందరికీ ఒకేలా పెట్టేవారు
డాక్టర్ తాతగారు.
రోజు వెళ్ళేవాణ్ణి
ఏ ఒక్కరోజూ
దేవుణ్ణి చూసిన
పాపాన పోలేదు.
చూసుంటే దేవుడు
దొరికేసేవాడు!
బ్రాహ్మీ ముహూర్తం కదా!
రెండు పనిచేసే రేడియోలున్న
పద్మాగాడింట్లో
దేవుడు ఉండే అవకాశమే లేదు.
వాళ్ళమ్మ చేసే సున్నుండలో
నెయ్యి ఎక్కువేసేది
వాడికి భలే ఇష్టం.
అలా ఉంటే గానీ తినేవాడు కాదు.
మీరు 'మా ఇంట్లో' తింటారా!!??
అని వీళ్లెప్పుడూ
అడగలేదు.
వెల్లటూరు తిరనాళ్ళలో సందడి. వెతకటం కుదర్లేదు.
కృష్ణా పుష్కరాల్లో ఈత, స్నానంతో సరిపోయేది.
శ్రీశైలంలో ఎండ.
కానీ, పులిహోర అంటే గుళ్లోనే తినాలి. ఇంట్లో ఆ రుచి రాదు.
వారణాసి వెళ్ళినప్పుడు మరీ చిన్నవాణ్ణి.
దసరాల్లో రోజూ అమ్మవారి దర్శనం.
గుడి మనదేగా.
మెట్లు ఎవరు ఫాస్ట్ గా ఎక్కుతారు?
పోటీ లో మా కాంతి గాడే గెలిచేవాడు.
కాంతి 73 నేను 72
ఒక రోజు
కాంతిగాడు పదైనా
ఇంటికి రాలేదు.
చాలా
భయమేసింది.
బాగా గుర్తు,
వరండాలోంచి
కనిపించే
పాత శివాలయం గోపురం
మీదున్న
శివలింగం
వైపు చూస్తూ
బాల్య స్నేహితుడి లాగా
కాసేపు
మాట్లాడాను.
ఆసరా అడిగాను.
‘కాంతి అంటే నాకు ప్రాణం’
అని చెప్పా.
మాటల్లోనే కాంతి ఇంటికొచ్చేశాడు.
చూపుడు వేలుకి ముద్దుపెట్టా.
కష్టాల్లో హెల్ప్ చేసే దేవుడికీ
కాస్త టచ్ లో ఉండడం
మొదలుపెట్టా.
ఏడేళ్ల క్రితం
ఫోనొచ్చింది.
కాంతి పోయాడు.
నాకూ దేవుడికీ మధ్య నిశ్శబ్దం.
ఆయనికి మాటలు రాలేదనుకుంటా.
నాకూ మాట్లాడానికి ఏమీ లేదు.
కార్యక్రమాలన్నీ అయిపోయాయి.
అమ్మా, నేను కూడా పెద్దగా మాట్లాడుకోవట్లేదు.
కొడుకు గురించి
ఆవిడ దుఃఖం ఆవిడదీ.
తమ్ముడు గురించి
నా దుఃఖం నాదీ
ఉన్నట్టుండి ఆలోచన మొదలైంది.
అసలీ దేవుడెవరు?
ఎక్కడుంటాడు?
ఓ సారి కలిస్తే బావుణ్ణు.
ఎలాగైనా తెలుసుకోవాలి.
నిలదియ్యాలి.
అసలెందుకిలా?
1 comment:
Beautifully written with depth and feeling.
Post a Comment