This on time - on various parts of his life, beautiful!
కాలం
కాలానికే రంగుంటే...
అది ఏ రంగు?
వేసవి సెలవుల్లో
హెడ్ మాస్టారు గదిలో
కాస్త దుమ్ముపట్టి
ఒంటరిగా
వేళ్ళాడుతూ
బిక్కుబిక్కుమంటున్న
అస్తిపంజరంలా ఉంది
కాలం
కోపంలోనో
బాధలోనో
ఫిజిక్స్ హెడ్ GRK గారు
పొట్లం కట్టకుండా
విసిరిన రికార్డ్ బుక్కులో
దిగిన
మేకు చేసిన
చిల్లులా ఉంది
కాలం
సరే
శుభ్రం చేద్దామని
రెడీ అయ్యి,
మోటర్ వెయ్యరా?
నీళ్ళయిపోయాయి!
అన్న
అభ్యర్థనకీ,
వాళ్ళ సమాధానానికీ
మధ్య
నిశ్శబ్దంలోని
అలజడిలా ఉంది
కాలం
'నువ్వు భలేరా'
అన్నాడు
కావాల్సినవాడొకడు
ఆనందాన్ని చెరిపేస్తూ...
నిజంగా నిజమా?
నిజంగా నిజమేనేమో!
మధ్య
ఊగుతున్న
అపోహలా ఉంది
కాలం
మసక తెర
ముతక మనుషులు
చెక్క కుర్చీ
ఉక్క గాలి
ఆహా! షో మొదలైంది.
అంతే..
అందం...
దుర్గంధం...
ద్వంద్వాల మధ్య
కొట్టుకు పోతూ
రంగులు పూసుకుని
జారవిడిచిన
ఉనికిలా ఉంది
కాలం
తలలో వెతలు
తైతక్కలు.
చిక్కులీడి
చుక్కచంద్రుళ్లు నా పక్క పైకొచ్చి
కైపెక్కి
కన్న కల్ల
చెరిగితే బావుణ్ణు
అనిపించే
నమ్మలేని
కలలా ఉంది
కాలం
వెతకడం మొదలెట్టా
పరిగెట్టా
ముందే తెలుసా?
వెతకక్కర్లేదా!
ఏంటో!!
తెలుసుకోవాలా?
నిజమేంటి?
చీకట్లో ప్రశ్నకి
చీకటి ప్రశ్నకి
నడుమ దాక్కోని
అన్నీ చూస్తుండే,
అందరిలా ఉండే
ఖాళీలా ఉంది
కాలం
కోలుకునే సరికి
కిర్రు శబ్దాలు
మేకుల రాతలు
తొడపై చరుపులు
చెవిలో పిలుపులు
'చాలా మంచోడురా'
చనువు తీసుకుని అనేశాడు ఒకడు
దూరం నించే చూస్తూ
తలమీద ఎవరో కొట్టారు
ఏ తల్లి కర్మో
ఏడుస్తూ లేచాను.
వేసవి అయిపోయింది
హెడ్ మాస్టార్రూంలో
అస్తిపంజరాన్ని
దులిపారానుకుంటా
తెల్లగా మెరుస్తూ ఉంది
పట్టబోయే
దుమ్ము గురించి తెలియక
అలానే
పొగరుగా
వేళ్ళాడుతోంది
No comments:
Post a Comment