Monday, June 5, 2023

Sagar's Poetry Corner - Aayu Aahu

Sagar writes brilliant poetry and I asked him if I could share it on my blog. Here's what he wrote after the recent visit from his niece and nephew from Chennai - Aayush and Aahana. Brilliant!


 ఆయూ ఆహూ

(ఆయుష్, ఆహనా)


ఇల్లెంత నిశ్శబ్దంగా ఉందంటే...


ఇల్లూడుస్తున్న అమ్మ చేతిలో

చీపురూ, నేల చెప్పుకునే కబుర్లు  స్పష్టంగా వినిపిస్తున్నాయి


ఉల్లిపాయలు

వందరూపాయలకే నాలుక్కిలోలు,

యాభైకి రెండు కిలోలు,

ఓ అస్పష్టమైన

దేవుడి పాట

మైకులో కింద నించీ వినిపిస్తున్నాయి.


ఇంటికేదో అయ్యింది!


ఎవరో ఇచ్చిన శుభలేఖ మీద ఒలికిన కాఫీ నల్ల రంగుకి మారిపోయింది.


మంచం కింద

ఓ రెండు గ్లాసులు,

కొన్ని చెంచాలు,

విరిగిపోయిన రూబిక్స్ క్యూబూ

దొరికాయి.


వీణ తీగొకటి తెగింది,


అమ్మ కళ్ళజోడు కలబడట్లేదు

ఫ్రిజ్జులో

సగం తాగిన కూల్ డ్రింక్స్

మిగిలిన రెండు పూతరేకులు


ఎక్సర్సైజ్ సైకిల్ కాస్త దెబ్బతింది


Desktop slow అయ్యింది


అక్కడా ఇక్కడా పడున్న

ఓ పదమూడున్నర పెన్నులూ

వేప్పుల్లలా కొరకబడిన  

ఓ పెన్సిలూ


ఇది మా ఇల్లేనా!?


పొద్దున్నే ఫోన్లో...

‘సాగర్ మామా, 

ఆయూ గాడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు!

హీ మిస్సెస్ యూ’


మరి నువ్వు?


నేను కూడా

ఇందాక మౌక్తిక ఫోన్ చేసింది

అంటూ తన ప్రపంచంలోకి

వెళ్ళిపోయింది ఆహన.


అమ్మమ్మింట్లో వేసవి సెలవలు అయిపోయాయి.


మేనకోడలు

మేనల్లుడు

ఊరెళ్ళిపోయారు


చాలా రోజుల తర్వాత,

అలసిపోయిన ఇల్లు

నిశ్శబ్దంగా

పలకరించింది.


నేల ఆదమరిచి నిద్రపోతోంది


దసరా సెలవలకి పంపిస్తాడా?

పొద్దున్నే ఆరింటికి

కాఫీ తాగుతూ అమ్మ -

......

......

కాఫీ అయిపోయింది.

పిల్లల కబుర్లే నెమరేసుకుంటూ,

మళ్లీ summer హాలిడేస్ దాకా

అమ్మా, నేనూ...

No comments: