Sunday, November 17, 2024

Sagar's Poetry Corner - Meeru Manchi Vallena?

Sagar's poetry as always sears the heart, goes into spaces we didn't know existed, leaves a very physical feeling.

This is based on a recent experience of his. 'Meeru Manchi Vallena?' translates into 'Are you good people too?'


'మీరు మంచి వాళ్లేనా?'

కుండపోతలో తడుస్తూ షామియానా లోకి అడుగు పెట్టగానే అడిగింది నిలదీస్తూ.

'లేదు! వీళ్ళకి మూడు పూటలు' అన్నారు ఎవరో. 


'అయితే మీ సామాన్లు వసారాలో పెట్టుకోండి' అంది  ఆజ్ఞాపిస్తూ.


లోపల గడప ముందు కుర్చీ మీద ఒకమ్మాయి కూర్చుని ఉంది దక్షిణం కేసి చూస్తూ.

లోపలికి వెళ్తూ 'ఇల్లు భలే కొత్తగా మార్చేశారు' అనుకుంది బాధలో ఉన్న అంతరాత్మ ఆశ్చర్యానికి లోనవుతూ.


ఎడమవైపు పడుకోపెట్టారు.


భలే చాలా బాధేసింది చాలా రోజుల తర్వాత.


కొన్ని గొంతుల్లో నిజం బాధ - కొన్ని గొంతుల్లో బాధ. 


కొన్ని బాధలు పలకరిస్తూ పరిచయం చేశాయి 'చూడరా! వెళ్ళిపోయాడు!'


'అక్కా, బావ ఇద్దరూ వెళ్ళిపోయారు' నిశ్శబ్ధంగా కూర్చున్న అమ్మ కళ్ళల్లో బోల్డంత దుఃఖం. 


బాధకి బ్రేక్ వేస్తూ

చార్జింగ్ కి పెట్టిన ఫోన్ 'ఆట కదరా శివ' అంటూ మోగడం మొదలు పెట్టింది. ఎవరో తీశారు. 

ఏదో మాట్లాడారు.

మళ్ళీ బాధ. 


బయటకి వచ్చా

అడ్డదిడ్డంగా వేసున్న కుర్చీలు.


'ఏరా ఎప్పుడు బయల్దేరారు?

పడుకున్నట్టే ఉంది ముఖం!

రేపు పన్నెండింటికి..

రెండిడ్లీ తిను...

రావాల్సిన వాళ్ళందరూ...

రైలు దిగి బస్సు మీద...

నెక్ట్ సినిమా ఎప్పుడూ?'


మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.


జోరున వాన కురుస్తూనే ఉంది.


తలకిందులు చేసిన ఇసుక తిన్నెలు లా ఉంది షామియానా వాన నీళ్లతో నిండి.


మరుసటి రోజు కార్యక్రమం అయ్యింది.


కొందరి మనసుల్లో మూగబోయిన బాధకి గొంతు వచ్చింది కాసేపు. 


వాన వెలిసింది.


హైద్రాబాద్ తిరిగి వచ్చేశాం.


మళ్ళీ పదో రోజు ఊరికి వచ్చాం.


ఎంత ఎండో!!!


అందరూ కాస్త తేలిక పడ్డారు. 


ఇప్పుడు బాధ మీద సంపూర్ణ హక్కులు కొందరి చేతుల్లోకి మారాయి.


ఒక పక్క ఉక్కపోత.


ఇంకో పక్క మొబైల్ లో తన చిన్నప్పటి ఫోటోలు చూపిస్తున్న అప్పుడే పరిచయమైన దూరపు చుట్టం.


మధ్యాహ్నం భోజనాలు మొదలయ్యాయి. 


అందరూ సీతారామయ్య గారి మనవరాలు మీనా లా గెంతుతూ వడ్డిస్తున్నారు. 


అక్కడక్కడా జోకులు. 


'ఇంకోటి వెయ్యి'

లడ్డూ నాకు భలే నచ్చింది. 


మొత్తానికి భోజనాలయ్యాయి సందడిగా.


తిన్న ఆకులు భీభత్స రసంలో ఇంకా టేబుల్ మీదే ఉన్నాయి.


లడ్డూలు కొన్ని మిగిలాయి ఆకుల్లో అక్కడక్కడా. ఒకట్రెండు సగం కొరికినవి కూడా.


'మిగిలిన లడ్డూలన్నీ తీసి ఓ ఆకులో పెట్టు'


'ఏం నువ్వు తింటావా?' అన్నాడు ఒక అనుచిత వాగుడు చుట్టం. 


'నువ్వుండు మావయ్యా! రేయ్ ఆ ఆకు తీసికెళ్ళి యానాదాళ్ళకియ్యి. ఆ చెట్టు కిందుంటారు.'


బోరింగ్ పంపు దగ్గర చేతులు కడుక్కుంటున్న చుట్టాల మాటలు కలగాపులగం అవుతున్నాయి గోలగా.


కళ్ళముందు వికారంగా ఆకుల్లో రకరకాల వడ్డనలకి అంటుకున్న లడ్డూలు, 

అవి తీసి ఇంకో ఆకులో  అశ్రద్ధగా పెడుతున్న చేతులు గుర్తొస్తున్నాయి.


'మీరు మంచి వాళ్లేనా?'

అని అడగాలనిపించింది.



No comments: