Another poignant poem from Sagar. This one is as brilliant as the rest.
పాత పాట
ఈ పాట
వినగానే బాధేసింది.
కారణం తెలియదు.
ఆ పాట పల్లవిలోనే
నా గతం ఏదో దాక్కుని ఉంది.
కాసేపు వెతికా.
దొరకలేదు.
ఈ పాట
రెండు సార్లు వస్తుంది
సినిమాలో.
ముందు ఓ లాగా.
చివర్లో పాథోసు.
ముందు ఓ లాగా ఉండే పాటే
ఇప్పుడు నేను విన్నది.
కాస్త బాధల్లా,
ఇంకాస్త విస్తరించింది.
మనసుకి
మబ్బు పట్టినట్టుంది.
దేవుణ్ణి పట్టించుకోకుండా
పాత శివాలయం
ముందు నించీ
అలజడిగా వెళ్లేప్పుడా?
అస్సలు రద్దీ ఉండని
అయ్యర్ దగ్గర
ఇడ్లీ కట్టిస్తున్నప్పుడా?
స్కూల్ యూనిఫాం ఇమ్మంటే
శేషగిరి బట్టల కొట్టు
చిరాగ్గా తీస్తున్నప్పడా?
ఎక్కడ్నించో..
రేడియోలో విన్నానా?
కుదిరితే
చెరిపాయలనిపించేంత
దుఃఖంగా ఉంది.
ఎక్కడ విన్నా?
ఏమైందప్పుడు?
ఇంకాస్త గతం లోపలికెళ్ళా
దీపావళి...
ఎండలో ఏ టపాసులూ
పెట్టలేదు.
అప్పుడు విన్నానా?
అసలు దీపావళి ఎందుకు గుర్తొచ్చింది?
పండగలన్నీ
వెతికి చూడ్డం మొదలుపెట్టా.
ఆ పాట
పండగల్లో వినుండను.
ఎందుకంటే
పండగలే ఎక్కువ బాధగా అనిపించాయి.
పండగలు
పక్కన పెట్టా.
ఓ రోజు
పక్కింట్లో
ప్రభాకర్ బాబాయ్
సిగిరెట్ కాలుస్తూ
మెట్ల మీదకి వచ్చాడు.
పలకరింపుగా నవ్వాడు.
బయట వాళ్ళెవరూ
చూడకూడదు అన్నట్టు
అప్పటిదాకా
ఇంట్లో
స్వేచ్చగా తిరుగుతున్న నిశ్శబ్దం
నోరుమూసుకుని
అమ్మ కళ్ళల్లో
నాన్న నడకలో
దాక్కుంది.
వడగాలితో పాటు
భయం కూడా
ఆ వాతావరణంలో
కలిసిపోయి ఉండేది ఎప్పుడూ.
నిశ్శబ్దం
భయం
తట్టుకోలేక
ఏం చెయ్యాలో తెలియలేదు.
నాకు తెలియకుండానే
దైర్యం నటిస్తూ
ఓ పాట పాడుకున్నా ,
నాన్నతో పాటు నడుస్తూ.
ఏదో అర్థం అయినట్లు
నాన్న నవ్వాడు నా వైపు చూస్తూ.
ఇది అదే పాటా?
అవును...
ఇంట్లోనే...
చాలా సార్లు ...
అదే పాట.
ఇంతలో
ఆలోచనలకు బ్రేక్స్ వేస్తూ,
సుబ్రహ్మణ్య విలాస్ లో విన్న
సరిగంచు చీరలు పెడతా
కవరింగు తననన తననా
పాట వచ్చేసింది
ఆలోచనలను తోసుకుంటూ
ఎందుకో.
భలే అనిపించింది.
గుడ్డూ గాడితో
క్రికెట్ కి వెళ్ళే ముందు,
శివుడితో ఖాళీ సాయంత్రాలు,
నాన్నతో అప్పుడప్పుడూ,
స్కూల్ కి వెళ్ళేముందు హడావిడిగా,
అర్థమవ్వని జోకులేసి నవ్వుకునే విజ్జి, కాంతీలతో,
బిల్లు నేకట్టేస్తా మీరెళ్ళండి అన్న సత్తిబాబాయ్ తో,
ఇప్పటికీ
హోటల్లో అడుగుపెడితే చాలు
ఆనందంలో మునిగిపోయే
ఇడ్లీ సాంబార్ గుర్తొచ్చింది.
ఇందాక
వినగానే బాధేసిన
ఆ పాట
మళ్లీ గుర్తొచ్చింది.
దాన్ని పక్కకి నెట్టి
యూట్యూబ్ లో
సరిగంచు చీరలు పెడతా
కవరింగు తననన తననా
పాట పెట్టా.
No comments:
Post a Comment